బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నట్లు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ అంతర్జాతీయ స్థాయిలో చర్చలను రేకెత్తించింది. ఈ ప్రాంతంలోని 85 శాతం భూభాగంపై తమ నియంత్రణ ఉందని, స్వతంత్ర జెండా, జాతీయ గీతం 'బలూచీ ఫాలూస్' పేరుతో కొత్త కరెన్సీని కూడా ప్రకటించారు.

బలూచిస్తాన్ పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు. ఇక్కడ బంగారం, సహజ వాయువు, బొగ్గు వంటి అరుదైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ప్రాంతం విడిపోతే పాక్ ఆర్థిక స్థితిగతులు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఆసియా దేశాల మధ్య వ్యూహాత్మక 'గేట్‌వే'గా పనిచేస్తున్న ఈ ప్రాంతం చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు కీలకం.

1947లో కళాత్ సంస్థానం నుండి బలవంతంగా విలీనం చేయబడిన బలూచిస్తాన్, దశాబ్దాలుగా స్వయంప్రతిపత్తి పోరాటంలో ఉంది. ఇప్పటికీ 70 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. చైనా ఈ ప్రాంతాన్ని తన 'బెల్ట్ అండ్ రోడ్' వ్యూహంలో కీలక భాగంగా చూస్తోంది.

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్వయంగా పార్లమెంట్‌లో బలూచ్ తిరుగుబాటుదారుల వద్ద ఉన్న ఆధునిక ఆయుధాలను గుర్తించారు. అంతర్జాతీయ గుర్తింపు సాధ్యత తక్కువమైనప్పటికీ, బలూచ్ ప్రజల స్వాతంత్ర్య కాంక్ష తగ్గలేదు.