బీహార్ రాష్ట్రం సివాన్‌కు చెందిన 18 ఏళ్ల శ్రేయా కౌశిక్, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లింకన్ స్కాలర్‌షిప్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 మంది విద్యార్థుల్లో శ్రేయా ఒకరు కాగా, భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థిని ఈమె.

ఈ స్కాలర్‌షిప్ ద్వారా అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్న సెంటర్ కాలేజీలో శ్రేయా నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ విద్యను ఉచితంగా అభ్యసించనుంది. సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ స్కాలర్‌షిప్, ట్యూషన్ ఫీజులతో పాటు వసతి, భోజనం, ఆరోగ్య బీమా, ప్రయాణ ఖర్చులు మరియు ఇతర విద్యా సంబంధిత వ్యయాలన్నింటినీ భరిస్తుంది.

ఢిల్లీలోని సర్వోదయ కన్యా విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసిన శ్రేయా, 13 ఏళ్ల వయసులోనే డెక్‌స్టెరిటీ గ్లోబల్ సంస్థలో చేరి నాయకత్వ శిక్షణ పొందింది. గతంలో నానో టెక్నాలజీ సాయంతో జల కాలుష్య నివారణ కోసం 'రివైవ్‌' అనే ప్రాజెక్టును అభివృద్ధి చేసి, జర్మనీకి చెందిన మెర్సిడెస్‌-బెంజ్‌ ఫెలోషిప్ ద్వారా రూ.3.3 లక్షల గ్రాంటును కూడా అందుకుంది.

తన విద్యా ప్రయాణానికి పూర్తి మద్దతు అందిస్తామని లింకన్ స్కాలర్స్ ప్రోగ్రామ్ ప్రకటించింది. సరైన అవకాశాలు లభిస్తే భారతీయ విద్యార్థులు ప్రపంచ స్థాయి విద్యాసంస్థల్లో రాణించగలరని డెక్‌స్టెరిటీ గ్లోబల్ సీఈవో శరద్ వివేక్ సాగర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో తన విద్యను సమాజ ప్రయోజనాల కోసం వినియోగిస్తానని శ్రేయా వెల్లడించింది.