థియేటర్లలో రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో రికార్డు సృష్టించిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. జూన్ 19న విడుదలైన ఈ సినిమా, కేవలం 28 రోజుల వ్యవధిలోనే జియో హాట్‌స్టార్ వేదికపై స్ట్రీమింగ్ ప్రారంభించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రస్తుతం అందుబాటులో ఉంది.
నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలో సమంత ‘స్వర్ణ’ పాత్రలో నటించింది. పెళ్లి తర్వాత కొత్త కుటుంబంలోకి అడుగుపెట్టిన యువతి జీవితంలో చోటుచేసుకున్న ఊహించని పరిణామాలు, ఆమె గతాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటం సినిమా కథాంశం. రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సమంతకు ఇది మరో విజయం. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, శ్రీముఖి, మంజూష ముళ్లపూడి, గౌతమి కీలక పాత్రలు పోషించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాల తరహాలోనే, మహిళా ప్రధాన చిత్రమైనప్పటికీ ఈ సినిమా తక్కువ సమయంలోనే ఓటీటీలోకి రావడం విశేషం. జూలై 17 అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలైన ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభిస్తోంది.








