సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించారు. 2020 అక్టోబర్ 29 నుంచి ఇప్పటివరకు జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, ప్రభుత్వ భూముల బదలాయింపులు వంటి అనుమానాస్పద లావాదేవీలను పరిశీలించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయనున్నారు. టెండర్ ప్రక్రియ నుంచి ఇటీవల వచ్చిన ఆరోపణల వరకు అన్ని అంశాలను ఈ బృందం లోతుగా విచారిస్తుంది.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం 30 నుంచి 35 శాతానికి మించలేదని గుర్తించిన ప్రభుత్వం, ఈ నష్టాన్ని అంచనా వేయాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించడంతో పాటు, రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించింది. ఈ నెల 20న జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, వ్యవసాయ నిపుణులతో సమావేశాలు నిర్వహించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.

మరోవైపు, మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణ కోసం పంచాయతీరాజ్ చట్టం–2018లో సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.