2018లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సముద్ర తీరంలో తాహ్లెక్వా అనే ఓర్కా జాతి తిమింగలం ఒక పిల్లకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన అర గంటలోనే ఆ పిల్ల తిమింగలం మరణించింది. తన బిడ్డను వదిలిపెట్టలేకపోయిన ఆ తల్లి, 17 రోజుల పాటు ఆ కళేబరాన్ని తన తల, ముక్కు సహాయంతో నీటిపైనే ఉంచింది.

ఈ క్రమంలో ఆ తల్లి తిమింగలం సముద్రంలో 1,600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. మృతదేహం నీటిలో మునిగిపోయిన ప్రతిసారీ, అది మళ్లీ లోతుల్లోకి వెళ్లి పిల్లను పైకి తెచ్చేది. ఈ దృశ్యాన్ని గమనించిన పరిశోధకులు దీనిని 'టూర్ ఆఫ్ గ్రీఫ్'గా పేర్కొన్నారు. ఆ తల్లి అలసిపోయినప్పుడు, గుంపులోని ఇతర తిమింగలాలు కూడా ఆ కళేబరాన్ని మోస్తూ తోడుగా నిలిచాయి.

ప్రకృతి ప్రేమికులను, శాస్త్రవేత్తలను కలచివేసిన ఈ ఘటన, మూగజీవులలో ఉండే భావోద్వేగాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ఓర్కా జాతులలో భావోద్వేగాలకు కారణమయ్యే హార్మోన్లు ఉంటాయని నిపుణులు స్పష్టం చేశారు. తాహ్లెక్వా ప్రవర్తన ద్వారా ఇది కేవలం సాధారణ చర్య కాదని, నిజమైన మాతృవేదన అని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ప్రస్తుతం వాతావరణ కాలుష్యం, ఆహార కొరత కారణంగా ఈ 'సదర్న్ రెసిడెంట్' ఓర్కా జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్నతల్లి ఆవేదనకు అద్దం పట్టిన ఈ ఘటన లక్షలాది మంది హృదయాలను కదిలించింది.