నల్గొండ ఎక్స్ రోడ్డు నుంచి ఒవైసీ జంక్షన్ వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ప్రకటించారు. సైదాబాద్ వై జంక్షన్ నుంచి యాదగిరి థియేటర్ వరకు కుడివైపున ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున, ఆ మార్గంలో ఒకవైపు రహదారిని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నల్గొండ ఎక్స్ రోడ్డు నుంచి చంద్రాయణగుట్ట వైపు వెళ్లే వాహనాలను సైదాబాద్ వై జంక్షన్ వద్ద దారి మళ్లిస్తారు. ఈ వాహనాలు సైదాబాద్ పోలీస్ స్టేషన్, శంకేశ్వర్ బజార్, సింగరేణి కాలనీ, చంపాపేట్ మెయిన్ రోడ్ మీదుగా డీఎంఆర్‌ఎల్ రోటరీ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, చంద్రాయణగుట్ట నుంచి నల్గొండ ఎక్స్ రోడ్డు వైపు వచ్చే వాహనాలు డీఎంఆర్‌ఎల్ వద్ద కుడి మలుపు తీసుకుని లక్ష్మారెడ్డి గార్డెన్ మీదుగా చంపాపేట్ వైపు వెళ్లాలని సూచించారు.
ఆర్టీసీ బస్సులు మరియు భారీ వాహనాల రాకపోకలపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఎంజిబిఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) మరియు చాదర్‌ఘాట్ నుంచి ఐఎస్ సదన్, చంపాపేట్ వైపు వెళ్లే బస్సులను నల్గొండ ఎక్స్ రోడ్డు వద్ద మళ్లించి, మలక్‌పేట్ గంజ్, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్ మీదుగా ఎల్బీనగర్ వైపు పంపిస్తారు.
ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మరియు స్థానిక కాలనీలకు చెందిన వాహనాల కోసం యాదగిరి థియేటర్ రోడ్డులోని ఇంటర్నల్ మార్గాలను కేటాయించారు. సైదాబాద్ వై జంక్షన్ నుంచి డీఎంఆర్‌ఎల్ వైపు వెళ్లే ఆటోలు, బైక్‌లు కేవలం తమ కోసం కేటాయించిన లేన్లలోనే ప్రయాణించాలని పోలీసులు స్పష్టం చేశారు.







