షావోమీ కంపెనీ చైనా మార్కెట్‌లో తన కొత్త 10 కేజీల మిజియా వాషింగ్ మెషీన్ ప్రోను అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ మెషీన్ ధర 2,699 యువాన్లు కాగా, ఇది మన కరెన్సీలో సుమారు రూ.38వేలుగా ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రజలు ఈ వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఈ మెషీన్‌లో అమర్చిన సూపర్ ఎలక్ట్రోలైసిస్ టెక్నాలజీ డైమండ్ లేయర్ ఎలక్ట్రోడ్‌ల సాయంతో నీటిని వేగంగా ఛార్జ్ చేస్తుంది. దీనివల్ల నీటిలో యాక్టివ్ ఆక్సిజన్ లెవల్స్ 15 రెట్లు పెరిగి, బట్టల లోపలి మురికిని, బ్యాక్టీరియాను సహజంగా తొలగిస్తుంది. సోయా సాస్, జ్యూస్, రక్తం వంటి 20 రకాల మొండి మరకలను కూడా ఇది సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది.
99.99 శాతం వరకు ఆటోమేటిక్ క్లీనింగ్ సామర్థ్యం కలిగిన ఈ మెషీన్, హై టెంపరేచర్ స్టీమ్ ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తుంది. రంగులు వెలిసిపోకుండా కాపాడటమే కాకుండా, తెల్లని బట్టలను మరింత తెల్లగా మార్చే సామర్థ్యం కూడా దీనికి ఉంది. అవసరాన్ని బట్టి డిటర్జెంట్, సాఫ్ట్‌నర్ మోతాదును కూడా ఇది స్వయంగా సెట్ చేసుకుంటుంది.
వాష్ మోడ్‌లలో 36 నిమిషాల క్విక్ వాష్, 12 నిమిషాల ఎక్స్‌ప్రెస్ సైకిల్, డౌన్ జాకెట్‌లు, ఉన్ని మరియు పెంపుడు జంతువుల వెంట్రుకల తొలగింపు కోసం ప్రత్యేక ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఇందులోని AI అసిస్టెంట్ ఆఫ్-పీక్ ఎనర్జీ షెడ్యూలింగ్‌తో పనిచేస్తుంది. Mi హోమ్ యాప్ లేదా షావోమీ స్పీకర్ ద్వారా వినియోగదారులు దీన్ని రిమోట్‌గా నియంత్రించవచ్చు.
కొనుగోలుదారులకు భరోసా ఇచ్చేలా, కంపెనీ ఈ మెషీన్‌లోని డీడీ డైరెక్ట్-డ్రైవ్ మోటార్‌పై 10 ఏళ్ల వారంటీ, మొత్తం యూనిట్‌పై 3 ఏళ్ల కవరేజీని అందిస్తోంది. ఐటీహోమ్ వర్గాలు ఈ వారంటీ వివరాలను ధ్రువీకరించాయి.








