అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ పదవుల విషయంలో అభిప్రాయ సేకరణకు తిరుపతిలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశం రణరంగంగా మారింది. తంబళ్లపల్లె ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పుంగనూరు ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరగాల్సిన ఈ భేటీలో వర్గీయ పోరు మితిమీరింది. తంబళ్లపల్లె సీట్ కోసం మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, తప్పించబడిన నేత జయచంద్రారెడ్డి వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఓ కార్యకర్తకు తీవ్ర గాయమైంది. దీనికి తోడు స్థానిక మీడియాపై కూడా దాడి జరగడం ఘటనను మరింత ఉద్రిక్తం చేసింది.

తంబళ్లపల్లెలో మొలకలచెరువు నకిలీ మద్యం కేసు నేపథ్యంలో జయచంద్రారెడ్డిని పదవి నుంచి తప్పించడం, ఆయన స్థానంలో శంకర్ యాదవ్‌ను నియమించే ప్రయత్నాలు ఈ ఘర్షణలకు ముఖ్య కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 60 వేలకు పైగా ఓట్ల బలం ఉన్న సామాజికవర్గం తమదేనని, జయచంద్రారెడ్డికే పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. మరోవైపు, పదేళ్లుగా స్థానికంగా అడ్రస్ లేని శంకర్ యాదవ్‌కు పదవి ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని స్థానిక సీనియర్ నేతలు తేల్చి చెప్పారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్ యాదవ్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనిపించలేదని కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

ప్రశాంతంగా ఉండే తిరుపతి నగరంలోకి పక్క జిల్లాల గొడవలు తెచ్చి పంచాయితీ పెట్టాలని సలహా ఇచ్చింది ఎవరనే దానిపై పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముగ్గురూ సమన్వయ లోపంతో వ్యవహరించారని, గొడవలు జరుగుతాయని తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోలేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనగాని సత్యప్రసాద్ నేరుగా మీటింగ్‌లో లేకపోయినా, జిల్లా ఇన్ఛార్జ్‌గా ఆయనకు కూడా బాధ్యత ఉంటుందని, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌కు మద్దతు ఇవ్వడం వల్లే ఈ సమావేశాన్ని తిరుపతికి మార్చారని ప్రచారం జరుగుతోంది.

ఈ ఘటనపై టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉంది. పార్టీ పరువు బజారున పడడమే కాకుండా మీడియాపై దాడి జరగడాన్ని పెద్ద మైనస్‌గా భావిస్తున్నారు. మొత్తం రచ్చకు ఇన్ఛార్జ్ మంత్రి అనగాని, జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య మరియు మరో ఇద్దరు నేతలే బాధ్యులని ప్రచారం సాగుతోంది. దీంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గొడవలకు కారణమైన లీడర్లు ఎవరు, మీటింగ్‌ను తిరుపతికి మార్చాలని సలహా ఇచ్చింది ఎవరనే అంశంపై నివేదిక కోరారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె, పుంగనూరు ఇన్ఛార్జ్ల అభిప్రాయ సేకరణను పార్టీ పెద్దలు ప్రస్తుతానికి పక్కనపెట్టారు.