ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 10న కలిదిండి మండలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గంలో పరిపాలనా యంత్రాంగం, రాజకీయ వర్గాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ముఖ్యమంత్రి పర్యటనతో ఈ ప్రాంతంలో సందడి నెలకొంది.
ఈ సభలో అర్హులైన లబ్ధిదారులకు 22ఏ పట్టాలు, కొత్త పాస్‌పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేయనున్నారు. ఏళ్లుగా భూ హక్కుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వేలాది కుటుంబాలకు ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా ఉపశమనం లభించనుంది. దీనితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రకటనలు వస్తాయని స్థానికులు ఆశిస్తున్నారు.
తాగునీరు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి కొత్త హామీలు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటన ఏలూరు జిల్లా అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని స్థానికులు భావిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పర్యవేక్షణలో సభా ప్రాంగణం, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాలపై అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించారు. అధికార కూటమి శ్రేణులు సభను విజయవంతం చేసేందుకు గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశాయి.







