ఈ-20 పెట్రోల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఎక్స్‌ వేదికగా విమర్శించారు. ఇథనాల్ కలిపిన ఈ పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజీ పడిపోవడమే కాకుండా, విడిభాగాలు పాడై రిపేర్లు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) కోసమే ప్రభుత్వం ఈ విధానాన్ని తెచ్చిందని, దీనివల్ల ఇథనాల్ దిగుమతులు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కేజ్రీవాల్ కార్యాచరణ ప్రకటించారు. ఆగస్టు 4న లాఠీలకు వెరవని 100 మందితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన వెల్లడించారు.

మరోవైపు, ఈ-20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమైన రాజకీయ విశ్లేషకుడు తహ్సీన్ పూనావాలాను పోలీసులు శనివారం గృహ నిర్బంధం చేశారు. ఆగస్టు 1న ఢిల్లీలోని గాంధీ స్మృతి వరకు పాదయాత్ర చేసి, అక్కడ మౌన నిరసనతో పాటు నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించిన నేపథ్యంలోనే పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

తమను ఉగ్రవాదిలా చూస్తున్నారని, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే గృహ నిర్బంధం చేస్తున్నామని పోలీసులు చెప్పినట్లు తహ్సీన్ పూనావాలా తెలిపారు. వందల మంది పోలీసులు తన ఇంటి వద్ద మోహరించి, బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఎక్స్‌లో వీడియోల ద్వారా వెల్లడించారు.