తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన అమెరికా పర్యటనలో భాగంగా బర్క్లీలోని గోల్డ్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో ఉన్న ఇండియా ఎనర్జీ & క్లైమేట్ సెంటర్ (IECC) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులను విస్తరించడంపై ఆయన లోతుగా చర్చించారు.
భారతదేశం 2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా గ్రిడ్ ఆధునీకరణ, ఆధునిక బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, పారిశ్రామిక డీకార్బనైజేషన్ వంటి అంశాలపై పరిశోధకులతో భట్టి విక్రమార్క ఆలోచనలు పంచుకున్నారు. తగ్గుతున్న క్లీన్-టెక్ సాంకేతిక ఖర్చులను అవకాశంగా మలుచుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న ఇంధన విధానాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో సోలార్ ప్రాజెక్టుల నిర్వహణ, పీఎం-కుసుమ్ పథకం ద్వారా రైతులకు స్వచ్ఛ ఇంధనం అందించడం వంటి ప్రజాకేంద్రిత నమూనాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందాయి. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను కొనసాగిస్తూనే, క్లీన్-టెక్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు.
సిలికాన్ వ్యాలీ ఆవిష్కరణలు, కాలిఫోర్నియా ఇంధన రంగ అనుభవాలను తెలంగాణలో అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విద్యుత్, రవాణా, పారిశ్రామిక రంగాలలో సంయుక్త అధ్యయనాలు చేపట్టడంతో పాటు, విధాన నిర్ణేతలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు యూసీ బర్క్లీ ప్రతినిధులతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.








