కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను, యువతను మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో యువత సమస్యల పరిష్కారం కోసం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట తప్పారని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సభను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, కోర్టు అనుమతి ఇచ్చిందని ఆయన వెల్లడించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు నిరుద్యోగులు, యువత అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు.