అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో సదరన్ బర్డ్ వింగ్ సీతాకోకచిలుక కనిపించడం ఈ ప్రాంత జీవవైవిధ్య పరిరక్షణకు కొత్త మలుపు తిప్పింది. ఈ సీతాకోకచిలుకను ఇప్పటివరకు తూర్పు కనుమల్లో చాలా అరుదుగా మాత్రమే నమోదుచేశారు. ఇప్పుడు అమ్రాబాద్ అడవుల్లో దీన్ని గుర్తించడం ఈ ప్రాంతం పర్యావరణ ప్రాముఖ్యతను మరింత పెంచింది.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నీలేష్, వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ కలిసి ఈ సీతాకోకచిలుకను గుర్తించారు. వీటి రెక్కల పరిమాణం 140-190 మిల్లీమీటర్లు, నలుపు-పసుపు రంగుల కలయికతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆడ సీతాకోకచిలుకలు మగదాని కంటే పెద్దవిగా ఉంటాయి. ఈ జాతి సాధారణంగా ఎత్తైన అడవులు, శాశ్వతహరిత అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది.
ఈ నమోదుతో అమ్రాబాద్ అడవుల జీవవైవిధ్యం గురించి మరింత పరిశోధనలు జరగడానికి అవకాశాలు తెరుచుకున్నాయి. ఇప్పటికే పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి జంతువులతో పాటు, ఈ అరుదైన సీతాకోకచిలుక కూడా ఈ ప్రాంతం ప్రత్యేకతను మరింత పెంచింది. పర్యావరణవేత్తలు ఈ ప్రాంతాన్ని మరింత పరిరక్షణకు అర్హమైనదిగా పరిగణించాలని కోరుతున్నారు.







