శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏపీలోని నాలుగు చోట్ల, హైదరాబాద్‌లోని ఆరు చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డి విల్లాలో అధికారులు తనిఖీలు చేస్తుండగా, ఆయన ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.

పులివెందులలోని ఎంపీ నివాసానికి వెళ్లిన అధికారులకు ఇంటికి తాళం వేసి ఉండటంతో వారు బయటే వేచి ఉన్నారు. ఎంపీ ఇంటి తాళాలు ఇవ్వాలని పీఏ రమణారెడ్డిని అధికారులు కోరగా, ఎంపీ నుంచి సమాచారం లేదని ఆయన నిరాకరించినట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో నలుగురు ఈడీ అధికారులు, ముగ్గురు పోలీసులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హవాలా మార్గంలో అంటే చట్టబద్ధం కాని పద్ధతుల్లో నగదు బదిలీ జరిగినట్లు అనుమానిస్తూ ఈడీ రంగంలోకి దిగింది. హత్యకు ముందు జరిగిన ఆర్థిక లావాదేవీలు, నిందితులకు అందిన రూ. 4 కోట్ల నగదు మూలాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

ఈ సోదాల్లో భాగంగా దేవిరెడ్డి శంకర్ రెడ్డి, దస్తగిరి నివాసాల్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సీబీఐ దర్యాప్తు సమయంలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈడీ అధికారులు ఆర్థిక పత్రాలను, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.

ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న వర్కర్ల మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీల దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.