నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం ఎర్రవెల్లి నుంచి బయలుదేరిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు ఆలేరు నియోజకవర్గంలో ఘనస్వాగతం లభించింది. బాహుపేట స్టేజీ వద్ద ప్రభుత్వ మాజీ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయన కోసం వేచి చూశారు.

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వేచి ఉన్న శ్రేణులు, కేసీఆర్ వాహనం రాగానే 'జై కేసీఆర్' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన వాహనాన్ని ఆపి గొంగిడి దంపతులను పలకరించారు. ఈ సమయంలో వాహనం చుట్టూ జనం కిక్కిరిసిపోవడంతో ఆయన బయటకు రాలేకపోయారు. ఈ క్రమంలో గొంగిడి సునీత తన వినతి పత్రాన్ని కేసీఆర్‌కు అందజేశారు. అనంతరం ఆయన వాహనాన్ని ముందుకు పోనిస్తూ, సునీతను తనతో పాటు నర్సంపేటకు రావాలని ఆహ్వానించారు.

ఈ రద్దీని ఆసరాగా చేసుకున్న దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. టెస్కాబ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి జేబులో ఉన్న రూ. 30 వేలు, తాళ్లగూడెం వార్డు సభ్యుడు ప్రవీణ్ జేబులోని రూ. 10 వేలతో పాటు మరికొంత మంది నాయకుల నగదును దొంగిలించారు. ఈ తోపులాటలో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించిన క్రమంలో గొంగిడి సునీత తలకు స్వల్ప గాయమైంది.

కేసీఆర్ తన వాహనంలో సుమారు 300 వాహనాల కాన్వాయ్‌తో నర్సంపేట వైపు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, లింగాల శ్రీకర్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.