పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన సీనియర్లను కాదని, కొత్తగా చేరిన వారికే ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఇస్తున్నారని కార్యకర్తలు మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివక్ష వల్ల చాలామంది కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 33 శాతం కేటాయించాలని యాదాద్రి, నల్గొండ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు నీలం పద్మ, మాధవి కోరారు. మోత్కూరు మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం స్వప్న మాట్లాడుతూ, సొంత పార్టీ కౌన్సిలర్లే తనకు సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు.
బీజేపీ తెలంగాణపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో, విభేదాలు వీడి ఓటర్ల జాబితాలో అర్హులైన వారి పేర్లు తొలగిపోకుండా చూడాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.








