పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో తిరుగుబాటుదారుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సంఖ్య 42కు పెరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సైనికులు, పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడింది. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద దాడి ఇదని భావిస్తున్నారు.

మొదట్లో 9 మంది పోలీసులు మరణించారని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ, తిరుగుబాటుదారులు చాలా మందిని కిడ్నాప్ చేయడంతో మృతుల సంఖ్య నెమ్మదిగా వెలుగులోకి వస్తోంది. మరోవైపు, ఈ దాడిలో 54 మంది తిరుగుబాటుదారులను హతమార్చినట్లు పాకిస్తాన్ వెల్లడించింది.

మృతదేహాల తరలింపు విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాడిలో చనిపోయిన పోలీసుల శవపేటికలను ఒక టెంపో వాహనంలో ఎక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక పాకిస్తానీ పౌరుడు ఈ దృశ్యాలను చిత్రీకరించి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో 10 మంది పోలీసుల మృతదేహాలు శవపేటికల్లో ఉండగా కనిపించాయి.

జియారత్ ప్రాంతంలో పైన్ చెట్ల మధ్య శవపేటికల ఊరేగింపు సాగుతోందని, ఇది కుటుంబాల కన్నీళ్లను మోసుకెళ్తోందని నెటిజన్లు భావోద్వేగంగా స్పందించారు. పాక్ సైన్యం, ఐఎస్ఐ విధానాలు ఈ నగరాన్ని శవపేటికల నగరంగా మార్చాయని, ఇది బలూచిస్తాన్‌కు రక్తపాతం మాత్రమే మిగుల్చిందని విమర్శలు గుప్పించారు.

ఈ దాడులకు సరిహద్దుకు బయట ఉన్న శక్తులే కారణమని పాకిస్తాన్ ఆరోపించింది. కిడ్నాప్ అయిన పోలీసుల కోసం పెద్ద ఎత్తున గాలింపు ఆపరేషన్ చేపట్టినట్లు, ఈ చర్యల్లోనే కొందరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పాక్ సైన్యం తెలిపింది.