రుణాల ఎగవేత కారణంగా బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఇళ్లు, భూములు, దుకాణాల విక్రయాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను గురువారం ప్రకటించింది. ఇకపై బ్యాంకులు జప్తు చేసిన ఆస్తులను ఏడు సంవత్సరాల లోపు తప్పనిసరిగా విక్రయించాలని కేంద్ర బ్యాంక్ ఆదేశించింది. ఈ అమ్మకాలను సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (SARFAESI) చట్టం ప్రకారం బహిరంగ వేలం ద్వారా మాత్రమే నిర్వహించాలి.
గతంలో పలుకుబడి ఉన్న ఎగవేతదారులు తమ ఆస్తులను వేలం వేసినప్పుడు, బంధువులు లేదా స్నేహితుల ద్వారా తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసేవారు. ఇలా పాత అప్పులను తీర్చుకుంటూనే ఆస్తులను తమ వద్దే ఉంచుకునే పద్ధతికి ఆర్‌బీఐ చెక్ పెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం, రుణగ్రహీతలకు లేదా వారి బంధువులకు, వారికి సంబంధించిన ఇతర పక్షాలకు బ్యాంకులు ఆస్తులను తిరిగి అమ్మకూడదు. రుణగ్రహీతలకు తమ ఆస్తులను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలన్న బ్యాంకుల అభ్యర్థనను కూడా ఆర్‌బీఐ తిరస్కరించింది.
ఈ చర్య బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు, అవినీతి పద్ధతులను నిర్మూలించే లక్ష్యంతో తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఆస్తులను శాశ్వతంగా లేదా నిరవధికంగా బ్యాంకులు తమ వద్ద ఉంచుకోకూడదు. ఈ నిబంధనల వల్ల బహిరంగ వేలంలో సాధారణ కొనుగోలుదారులు మార్కెట్ విలువకే ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది.
ఈ కొత్త విధానం వల్ల రుణాలు ఎగవేసే ధోరణి తగ్గుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. బ్యాంకులకు నిధులు సకాలంలో అందడం వల్ల సాధారణ వినియోగదారులకు రుణ ప్రక్రియ సులభతరం అవుతుంది. అంతేకాదు, ఈ మార్పుల ప్రభావం భవిష్యత్తులో వడ్డీ రేట్లపై కూడా ఉండే అవకాశం ఉందని ఆర్‌బీఐ తెలిపింది.








