వేసవికాలంలో చెమట ఎక్కువగా పట్టి, తగినంత నీరు తాగకపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. శరీరంలో నీటి కొరత ఏర్పడి మూత్రం పరిమాణం తగ్గినప్పుడు, ఖనిజ వ్యర్థాలు పేరుకుపోయి గట్టిపడతాయి. దీంతో పాటు అధిక ఉప్పు, మాంసాహారం తీసుకోవడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.

రాళ్లు కదలకుండా ఉన్నంత వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, కానీ అవి కదిలి మూత్ర ప్రవాహానికి అడ్డంకిగా మారినప్పుడు తీవ్రమైన నొప్పి పుట్టుకొస్తుంది. నడుము పక్క భాగం లేదా వీపులో మొదలైన ఈ నొప్పి క్రమంగా తొడల వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రంలో రక్తం కనిపించడం, వికారం, వాంతులు, జ్వరం లేదా చలి వణుకులు రావడం వంటి సంకేతాలు కూడా గమనించాలి.

ఈ సమస్యను నివారించడానికి రోజంతా సమానంగా నీరు తాగడం అత్యంత కీలకం. ఉదయం లేవగానే అర లీటర్, బయటకు వెళ్లే ముందు మరో అర లీటర్, పని సమయంలో ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్లు తాగడం మంచిది. ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో పాటు, ప్యాకెట్ స్నాక్స్, చిప్స్, ఊరగాయలు, ఫాస్ట్‌ఫుడ్ వంటివాటిని పరిమితం చేసుకోవాలి. కాల్షియం రాళ్లు ఉన్నాయని భయపడి పాలు, పెరుగు మానేయకూడదు, ఎందుకంటే కాల్షియం తక్కువైతే ఆక్సలేట్ శోషణ పెరిగి రాళ్లు మరింత ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

నిమ్మరసంలో ఉండే సిట్రేట్ రాళ్లు ఏర్పడే అవకాశాన్ని తగ్గించగలదు, కానీ ఇది ఇప్పటికే ఏర్పడిన రాళ్లను కరిగించదు. ఎర్ర మాంసం, చికెన్ వంటివి అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని మితంగా వినియోగించాలి. నొప్పి తగ్గిపోయిందని రాళ్లు పూర్తిగా బయటకు వచ్చాయని అనుకోకూడదు, స్కానింగ్ ద్వారా నిర్ధారించుకోవడం అవసరం.

జ్వరం, తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం కనిపించడం లేదా లక్షణాలు మళ్లీ మళ్లీ రావడం వంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా యూరాలజిస్టును సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒక్క కిడ్నీ ఉన్నవారు, గర్భిణులు, మధుమేహంతో బాధపడేవారు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంటి చిట్కాలతో చికిత్స చేసుకోవడానికి ప్రయత్నించకుండా, మూత్ర ప్రవాహానికి అడ్డంకి ఏర్పడిన అనుమానం ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ఉత్తమం.