విశాఖపట్నం జిల్లా అగనంపూడిలో కూలీ పనులకు వెళ్లే నలుగురు యువకులు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. రోజంతా కష్టపడి ఇంటికి తిరిగి వచ్చిన వారు, భోజనం ముగించుకుని పడుకోవడానికి సిద్ధమయ్యారు. గదిలో నేలపై వేర్వేరుగా పరుపులు వేసుకుని నిద్రపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అందులో ఒక యువకుడు దోమల నుంచి రక్షణ కోసం దోమతెరను సిద్ధం చేసుకున్నాడు. పడుకునేందుకు ఆ దోమతెరను పైకి లేపి లోపలికి వెళ్లే క్రమంలో, అతని కాలికి ఏదో మెత్తటి వస్తువు తగిలింది. ఆ వస్తువు కదలడాన్ని గమనించిన యువకుడు, వెంటనే అప్రమత్తమై బయటకు వచ్చాడు.

దోమతెర లోపల ఉన్నది ఏంటో చూసిన యువకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అందులో ఆరడుగుల పొడవున్న నాగుపాము ఉండటంతో, ఆ యువకులు భయంతో గదిలో నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే వారు పాములను పట్టుకునే నిపుణుడు (స్నేక్ కేచర్) కిరణ్ కుమార్‌కు సమాచారం అందించారు.

అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అక్కడికి చేరుకున్న కిరణ్ కుమార్, ఆ పామును సురక్షితంగా బయటకు తీసి రెస్క్యూ చేశారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో యువకుడి కాలు పాముకు తగిలినా, అది కాటు వేయలేదు. పాము కాటు వేసి ఉంటే ప్రాణాపాయం జరిగి ఉండేదని కిరణ్ కుమార్ పేర్కొన్నారు.