వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి, తన మైనర్ కూతురిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడికి ఇద్దరు భార్యలు ఉండగా, రెండో భార్య మరణించిన తర్వాత ఆమెకు పుట్టిన ముగ్గురు కూతుళ్ల బాధ్యత తండ్రిపైనే ఉంది. ఈ క్రమంలోనే నిందితుడు తన చిన్న కూతురిని లక్ష్యంగా చేసుకుని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

బాధితురాలు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. తండ్రి తనపై చేసిన లైంగికదాడి గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో, భయపడిన బాలిక కొంతకాలం మౌనంగా ఉంది. అయితే, హాస్టల్‌లో ఉన్న సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ బాలిక ఏడవడంతో, పాఠశాల టీచర్లు, హాస్టల్ వార్డన్ ఆమెను విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా, లైంగికదాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వికారాబాద్ పోలీసులు, బాలల లైంగిక నేరాల చట్టం (POCSO) కింద నిందితుడిపై చర్యలు తీసుకున్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వికారాబాద్ సీఐ రఘుకుమార్ తెలిపారు. గురువారం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.