హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ (MCRHRD) బోధి పెవిలియన్‌లో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల విద్యార్థుల యూనిఫాంల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. పేద విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, దుస్తుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీకి తావులేదని ఆయన తేల్చి చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో పాఠశాల దుస్తుల పంపిణీలో జరిగిన లోపాలను సీఎం ప్రస్తావించారు. ఇకపై అలాంటి పొరపాట్లు జరగకూడదని, పారదర్శకతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. యూనిఫాంలను సకాలంలో కుట్టించి సరఫరా చేసేలా సంబంధిత సంస్థలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఆగస్టు 15వ తేదీ నాటికి యూనిఫాంలు అందజేయాలని గడువు విధించారు.
వచ్చే విద్యా సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికే విద్యార్థులకు దుస్తులు సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి విద్యార్థి నుంచి యూనిఫాం నాణ్యత, ఫిట్టింగ్‌పై ఫీడ్‌బ్యాక్ సేకరించాలని సూచించారు. విద్యార్థుల అభిప్రాయాల ఆధారంగానే భవిష్యత్తులో పంపిణీ ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులుతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








