1996 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడ్డాయి. మ్యాచ్ ప్రారంభం నుంచే మైదానంలో వాతావరణం వేడెక్కింది. పాక్ కెప్టెన్ ఆమీర్ సోహైల్ భారత బౌలర్లపై దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.

15వ ఓవర్ వేస్తున్న వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్‌లో సోహైల్ ఒక ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బ్యాట్ చూపిస్తూ, బంతిని తెచ్చుకోమని ప్రసాద్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనతో స్టేడియంలోని ప్రేక్షకులు, భారత ఆటగాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రసాద్ మాత్రం ఏమీ మాట్లాడకుండా తన బౌలింగ్‌పైనే దృష్టి పెట్టారు.

మరుసటి బంతికే ప్రసాద్ అద్భుతమైన ఇన్-స్వింగర్‌తో సోహైల్ వికెట్లను చెల్లాచెదురు చేశారు. వికెట్ పడగానే ప్రసాద్ ఆవేశంతో సోహైల్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లమని గర్జించారు. ఈ వికెట్‌తో మ్యాచ్ మలుపు తిరగడంతో భారత్ విజయం సాధించింది.

ఈనెల 5న వెంకటేష్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ విషెస్ తెలిపారు. దశాబ్దాలు గడిచినా, ఈ ఘటన భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.