విశాఖపట్నం, హైదరాబాద్‌లతో పాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు మల్ల విజయ ప్రసాద్, వరహ రామకృష్ణ సత్య శ్రీనివాసరావు అల్లా నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ తనిఖీలు జరిగాయి. ఈ క్రమంలో రూ. 1.01 కోట్ల నగదు, కీలక ఆస్తి పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంస్థకు చెందిన 182 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో పాటు ఆరు లగ్జరీ వాహనాలను ఈడీ సీజ్ చేసింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, డిపాజిట్ పథకాల పేరుతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రజల నుంచి ఈ సంస్థ భారీగా నిధులు సేకరించింది. విశాఖపట్నంలో భూములు ఇస్తామని నమ్మించి, ఆ తర్వాత కార్యాలయాలను మూసివేసి పెట్టుబడిదారులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

కొత్తగా వచ్చిన పెట్టుబడిదారుల సొమ్ముతో పాత వారికి చెల్లింపులు చేస్తూ, మిగిలిన నిధులను డైరెక్టర్లు తమ వ్యక్తిగత అవసరాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR) ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు.