కేరళలోని వయనాడ్ జిల్లా తోల్పట్టి సరిహద్దు ప్రాంతంలో తిరునెల్లి పోలీసులు, జిల్లా మాదకద్రవ్యాల నిరోధక ప్రత్యేక బృందం సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. కర్ణాటక నుంచి వస్తున్న ఒక వాహనాన్ని ఆపి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీల్లో భాగంగా డ్రైవర్ సీటు కింద ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరను పోలీసులు గుర్తించారు. అందులో దాచి ఉంచిన నగదు కట్టలను బయటకు తీసి లెక్కించగా, మొత్తం రూ. 1,44,50,000 ఉన్నట్లు తేలింది.
ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోజికోడ్ జిల్లా వడకరకు చెందిన 20 ఏళ్ల ప్రభు రాజ్, కన్నూర్ జిల్లా పనూరుకు చెందిన 23 ఏళ్ల స్వప్నిల్, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల రాహుల్‌గా గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలపై నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.








