2022లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'వదంది' మొదటి సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అప్పట్లో ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు తెలుగులో కూడా మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సిరీస్ రెండో సీజన్‌ను కొత్త కథాంశంతో, కొత్త పాత్రలతో రూపొందించారు.

‘వదంది : ది మిస్టరీ ఆప్ మణి’ పేరుతో వస్తున్న ఈ కొత్త సీజన్‌లో శశి కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు పుష్కర్-గాయత్రి క్రియేటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 07 నుంచి అమెజాన్ ప్రైమ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సీజన్ కథ ఒక ఎస్సై చేసిన పొరపాటు చుట్టూ తిరుగుతుంది. ఆ ఎస్సై చేసిన తప్పు వల్ల ఒక అమాయకుడు జీవిత ఖైదు అనుభవించాల్సి వస్తుంది. తన తప్పును తెలుసుకున్న ఎస్సై, ఆ వ్యక్తిని జైలు నుంచి ఎలా బయటకు తీసుకువచ్చాడు, చివరకు ఏం జరిగింది అనేదే ఈ సిరీస్ ప్రధానాంశం.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. కొత్త పాత్రలతో వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.