సెప్టెంబర్ 3న జరిగిన గ్రాండ్ ఫినాలేతో 'ది ట్రేటర్స్ ఇండియా' సీజన్ 2 ముగిసింది. సాధారణ రియాలిటీ షోల మాదిరిగా కాకుండా, ఇది నమ్మకం, అనుమానాల మధ్య సాగే మైండ్ గేమ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పక్కన ఉన్న కంటెస్టెంట్ ట్రేటరా లేక ఇన్నోసెంట్ (నిర్దోషి) అనే విషయాన్ని చివరి వరకు కనిపెట్టడం ఈ ఆటలో ప్రధాన సవాల్.

ఈ సీజన్‌లో క్రిస్టల్ డిసౌజా, రిదా థరానా సంయుక్త విజేతలుగా నిలిచారు. వీరు ఇద్దరూ కలిసి రూ.66 లక్షల బహుమతిని సొంతం చేసుకున్నారు. ప్రైజ్ పూల్‌లో ఉన్న రూ.48.40 లక్షలకు, ఫైనల్ టాస్క్ ద్వారా అదనంగా రూ.17.60 లక్షలు చేరడంతో మొత్తం బహుమతి రూ.66 లక్షలకు చేరుకుంది.

క్రిస్టల్ మొదటి నుంచి ట్రేటర్‌గా తన గుర్తింపును చివరి వరకు బయటపడకుండా జాగ్రత్త పడింది. తనపై అనుమానం వచ్చిన ప్రతిసారీ, ఆ అనుమానాలను చాకచక్యంగా ఇతర కంటెస్టెంట్ల వైపు మళ్లించడంలో ఆమె సఫలమైంది. ఆమె వ్యూహాత్మక తెలివితేటలను షో హోస్ట్ కరణ్ జోహార్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.

రిదా థరానా ప్రయాణం భిన్నంగా సాగింది. గేమ్ మొదట్లో ఇన్నోసెంట్‌గా ఉండి ట్రేటర్లను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆమె, ఆ తర్వాత ట్రేటర్‌గా మారింది. కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ, క్రిస్టల్‌తో కలిసి వ్యూహాలు రచిస్తూ ఆమె చివరి వరకు ఆటలో నిలబడింది.

చివరికి ఇన్నోసెంట్లను బురిడీ కొట్టించడంలో ట్రేటర్లు విజయం సాధించారు. అందరినీ మోసం చేస్తూ చివరి వరకు ఆడిన క్రిస్టల్, రిదా ఈ మైండ్ గేమ్‌లో కప్పును గెలుచుకున్నారు. దీంతో ఈ సీజన్ విజేతలుగా ట్రేటర్లే నిలిచారు.