ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీ ప్రాంతంలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో వరద నీటితో పాటు మట్టి, బురద, పెద్ద బండరాళ్లు వేగంగా వచ్చి మెటల్ బ్రిడ్జిని ఢీకొన్నాయి. దీంతో ఆ వంతెన క్షణాల్లోనే నీటిలో కొట్టుకుపోయింది.

ఈ ప్రమాద సమయంలో బ్రిడ్జిపై ఉన్న కొన్ని వాహనాలు కూడా వరదలో కొట్టుకుపోయాయి. అయితే, సమీప రహదారిపై ఉన్న ఒక ట్రక్ డ్రైవర్ అప్రమత్తమై తన వాహనాన్ని వెనక్కి మళ్లించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి.

వంతెన కూలిపోవడంతో నీతి వ్యాలీ ప్రాంతానికి ప్రధాన పట్టణంతో ఉన్న రవాణా సంబంధాలు తెగిపోయాయి. చమోలీ పోలీసులు, ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (USDMA) బృందాలను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపడుతున్నారు.

పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ప్రాంతంలో ప్రయాణాలు చేయవద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు. నదులు, వాగుల సమీపంలో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.