నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామ్యూల్ అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరిగాయి. మంత్రి తన పర్యటన గురించి సమాచారం ఇవ్వలేదని, రోడ్ల అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సామ్యూల్ చేసిన విమర్శలే ఈ గొడవకు ప్రధాన కారణమయ్యాయి.
ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెంకట్ రెడ్డి మద్దతుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే సామ్యూల్ మంత్రికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై మంత్రి మద్దతుదారులు సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే అనుచరుల తీరుపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరనున్నారు.
నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత జూలై 8న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుదారులను ఎమ్మెల్యే మందుల సామ్యూల్ అనుచరులు వెంబడించి దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.







