రవీంద్ర భారతి వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నల్గొండ జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఏపూరి సోమన్నను ఎమ్మెల్యేగా గెలిపిస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. గతంలో వైఎస్ షర్మిల పార్టీలో పనిచేసిన సోమన్న, అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఉన్నారు.
తుంగతుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే సామేల్‌తో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇటీవల మాటల యుద్ధం జరిగింది. ఈ వివాదానికి సంబంధించి తుంగతుర్తి ప్రజలకు రాజగోపాల్ రెడ్డి క్షమాపణలు చెప్పి ఆ ఎపిసోడ్‌ను ముగించారు. అయితే, ఇప్పుడు సోమన్నను తెరపైకి తీసుకురావడం ద్వారా సామేల్‌కు చెక్ పెట్టేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయినప్పటికీ, అక్కడ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి బలమైన పట్టు ఉంది. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం కూడా అక్కడ ప్రభావవంతంగా పనిచేస్తుంది. జిల్లా నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా, రాజకీయంగా ఒక నిర్ణయానికి వస్తే అంతా కలిసి పనిచేస్తారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
నియోజకవర్గం పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, తన చేతుల మీదుగా గెలిచిన వారే తనకు కాకుండా పోతున్నారంటూ రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీనిని బట్టి తుంగతుర్తిలో సోమన్నను బరిలోకి దించేందుకు ఆయన ఇప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.







