తిరుమల కొండపై ఉన్న సుమారు 162 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, కాంటీన్లలో గోబీ 65, గోబీ మంచూరియా వంటి వంటకాల విక్రయాలను టీటీడీ ఆరోగ్య విభాగం నిలిపివేసింది. క్యాలీఫ్లవర్‌లో పురుగులు ఉంటున్నాయని భక్తులు ఫిర్యాదు చేయడంతో, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఈ సీజన్‌లో క్యాలీఫ్లవర్‌లో పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే భక్తుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని టీటీడీ భావిస్తోంది. భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమనారాయణ హోటల్ నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భక్తుల శ్రేయస్సు దృష్ట్యా గోబీ వంటకాలను అమ్మవద్దని ఆయన స్పష్టం చేయగా, నిర్వాహకులు కూడా ఈ నిర్ణయానికి సహకరించేందుకు అంగీకరించారు.
మరోవైపు, తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన ట్రస్టులో క్యాలీఫ్లవర్ వాడకంపై త్వరలోనే స్పష్టత రానుంది. ప్రతిరోజూ సుమారు రెండు లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తుండగా, దాతల నుంచి వచ్చే 20 టన్నుల కూరగాయల్లో క్యాలీఫ్లవర్ కూడా ఉంటోంది.
ఒకవేళ క్యాలీఫ్లవర్‌పై పూర్తిస్థాయి నిషేధం విధిస్తే, దాతల నుంచి వీటిని సేకరించడం నిలిపివేస్తారు. అంతేకాదు, తిరుపతి నుంచి కొండపైకి క్యాలీఫ్లవర్ రాకుండా విజిలెన్స్ విభాగం ద్వారా నిఘా పెట్టేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు.








