మనం రోజువారీగా చేసుకునే కూరలు, సాంబారు, పప్పుల్లో మంచి సువాసన కోసం కరివేపాకును వాడుతుంటాం. అయితే భోజనం చేసేటప్పుడు ప్లేట్‌లో అది కనిపించగానే చాలామంది ఏరి పక్కన పారేస్తుంటారు. కానీ కరివేపాకు కేవలం పోపు దినుసు మాత్రమే కాదు, అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూర.

ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు ఒక సంజీవని లాంటిది. ఇది కంటిచూపును మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు కరివేపాకును ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.

అంతేకాదు, జుట్టు కుదుళ్లను బలంగా మార్చడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

శరీరంలోని విష మలినాలను బయటకు పంపడంలో కూడా కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా రక్తాన్ని శుద్ధి చేసి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. కాబట్టి ఇకపై వంటల్లోని కరివేపాకును పక్కన పడేయకుండా తినడం అలవాటు చేసుకోండి.