అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మధ్య క్యాంప్ డేవిడ్‌లో జరిగిన సమావేశంలో ఘాటుగా వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఇరాన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న క్రమంలో ఈ విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి థాడ్ (THAAD), పేట్రియాట్ వంటి ఖరీదైన క్షిపణులను అమెరికా ఎక్కువగా ప్రయోగించడంతో ఈ కొరత ఏర్పడింది.

అయితే, ఈ కథనాలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఖండించారు. ట్రంప్, హెగ్సెత్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. పెంటగాన్ వర్గాలు కూడా ఆయుధ నిల్వల సమాచారాన్ని హెగ్సెత్ ఎప్పటికప్పుడు ట్రంప్‌కు తెలియజేస్తున్నారని పేర్కొన్నాయి. యుద్ధం కొనసాగించలేని పరిస్థితిపై రక్షణ నిపుణులు హెచ్చరించినట్లు వస్తున్న వార్తలను కూడా పెంటగాన్ తోసిపుచ్చింది.

ఇరాన్ చౌకగా తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తుండగా, అమెరికా ఖరీదైన క్షిపణులను వాడాల్సి రావడం వ్యూహాత్మక ఇబ్బందులకు దారితీసింది. ఆయుధాల కొరత విషయం తెలిసిన వెంటనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. రక్షణ శాఖను సంప్రదించకుండానే ట్రంప్ యుద్ధ వ్యూహాలను అమలు చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది.

ఇరాన్‌పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని భీకర దాడులు చేస్తామని ప్రకటించిన ట్రంప్, ప్రస్తుతం తన దూకుడును తగ్గించారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, ఇది ఆ దేశానికి చివరి అవకాశమని ఆయన పేర్కొన్నారు.