తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వద్ద పరిశుభ్రతను పెంచేందుకు ఆరోగ్యశాఖ అధికారులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరిల ఆదేశాల మేరకు, ప్రతి మంగళవారం తిరుమలలో 'క్లీనింగ్ డే'గా పాటించాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయం ప్రకారం, ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను పూర్తిగా మూసివేయాలి. ఈ సమయంలో దుకాణాల పరిసరాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. మూడో సత్రం, పీఏసీ-1, పీఏసీ-2 ప్రాంతాల్లో ఇప్పటికే ఈ పారిశుధ్య పనులు మొదలయ్యాయి.
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వద్ద అపరిశుభ్రత నెలకొందని భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో డిప్యూటీ ఈవో సోమన్నారాయణ ఈ చర్యలకు ఉపక్రమించారు. దుకాణాల్లో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు లేకుండా చూడటంతో పాటు, ఆహార పదార్థాల తయారీ మరియు నిల్వ చేసే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని అధికారులు స్పష్టం చేశారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం అందించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించకుండా దుకాణాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. పారిశుధ్యం విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.








