తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని వసతి గదుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానాలు) అధికారులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఈ అరెస్టులు చేశారు. నిందితులు నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి, రిజిస్ట్రేషన్ పద్ధతిలో గదులను పొంది, వాటిని సిఆర్వో కార్యాలయం వద్ద వేచి ఉన్న భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
తిరుమలలో వసతి గదుల కేటాయింపు కోసం టీటీడీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ఆధార్ కార్డు ఆధారంగా ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన గదులను కేటాయిస్తారు. ఈ విధానాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు, రోటేషన్ పద్ధతిలో గదులను పొంది భక్తులను దోచుకుంటున్నారు.
మరోవైపు, 125 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వేంకటాద్రి నిలయంలో భద్రతా లోపాలు దొంగలకు అనుకూలంగా మారాయి. ఈ వసతి సముదాయంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో, భక్తులు ఆదమరిచిన సమయంలో సెల్ ఫోన్లు, నగదు చోరీకి గురవుతున్నాయి. వసతి గదులు పొందిన వ్యక్తులే ఇక్కడ సేదతీరుతూ, ఇతర భక్తుల బ్యాగులు, ఫోన్లు కాజేస్తున్నట్లు గుర్తించారు.
యాత్రికుల వసతి సముదాయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టీటీడీ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు స్పందన లేదు. ఈ నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ మరియు పోలీసులు అప్రమత్తం కాకపోతే భక్తులు మరింతగా మోసపోయే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








