తిరుమలలోని ఏడవ మైలు ప్రాంతంలోని ఆంజనేయస్వామి విగ్రహాన్ని దొంగిలించిన కేసును తిరుపతి పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ నేరానికి సంబంధించి విశాఖపట్నం నుండి వచ్చిన యశ్వంత్ కుమార్ (23) అనే బి.టెక్ విద్యార్థిని అరెస్ట్ చేసారు.

నిందితుడు తన ఇంటికి విగ్రహాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈ చోరీకి దిగినట్లు పోలీసులు తెలిపారు. చదువు పూర్తయినా ఉద్యోగం దొరకకపోవడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన అతను ఆధ్యాత్మిక చింతనలను అనుసరించడం ప్రారంభించాడు. ఈ ప్రక్రియలో తిరుమలలోని ఒక మఠంలో కొన్ని రోజులు గడిపాడు.

ఈ నెల 21వ తేదీ ఉదయం నిందితుడు తిరుమల GNC నుంచి తిరుపతికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఏడవ మైలు వద్ద జీపును ఆపమని డ్రైవర్‌కు చెప్పి, అక్కడున్న విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. పోలీసులు జీపు డ్రైవర్‌ను విచారించి నిందితుడి వివరాలు తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విశాఖపట్నం పారిపోతుండగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

ఏఎస్పీ రవి మనోహరాచారి మీడియాకు ఇచ్చిన వివరాల ప్రకారం, నిందితుడు విజయనగరం జిల్లా గొర్లమండలంలోని ఒక మఠంలో కొన్ని రోజులు గడిపాడు. తిరుమలకు వచ్చినప్పుడు ఏడవ మైలు వద్ద ఉన్న విగ్రహం తన ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈ నేరానికి దిగాడు.