హైదరాబాద్‌లోని టోలీచౌకి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉగాండా దేశస్థురాలు నబంజ శారన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె తన వద్ద సరైన పత్రాలు లేవని, వీసా గడువు ముగిసినా అక్రమంగా భారత్‌లో ఉంటున్నానని అంగీకరించింది. ఆమె 2019 మార్చి 6న ఈ-టూరిస్ట్ వీసాపై ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశంలోకి ప్రవేశించింది.

ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడ చిన్నచిన్న పనులు చేసిన శారన్, ఆ తర్వాత డ్రగ్ ముఠాలతో పరిచయాలు పెంచుకుంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బెంగళూరు, హైదరాబాద్‌లలో డ్రగ్ పెడ్లర్లతో కలిసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడింది. ఆమె టూరిస్ట్ వీసా గడువు 2019 మే 4తోనే ముగిసినప్పటికీ, పాస్‌పోర్ట్ 2027 నవంబర్ 23 వరకు చెల్లుబాటులో ఉంది.

ఈ నేపథ్యంలో, ఆమెను స్వదేశానికి పంపించేందుకు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) అధికారులు ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ద్వారా బహిష్కరణ ప్రక్రియను చేపట్టారు. ఆమెను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన అధికారులు, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉగాండాకు వెళ్లేందుకు ఈ రోజు (12-08-2026) విమాన టికెట్ బుక్ చేశారు.

మత్తుపదార్థాల రవాణా, విక్రయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని పోలీసులు సూచించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే 8712661601 నంబరుకు తెలియజేయాలని H-NEW కోరింది. ఈ ఆపరేషన్‌లో ఇన్‌స్పెక్టర్లు పి. శ్రీధర్, ఎం. మధు బాబు పాల్గొన్నారు.