కడపకు చెందిన ఓ మహిళ, వేంపల్లి మండలం కత్తులూరు గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం పెంచుకుంది. తాను ప్రేమిస్తున్నానని నమ్మించి, అతడిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చింది. ఈ నమ్మకంతో సదరు మహిళ వివిధ అవసరాల పేరుతో యువకుడి నుంచి సుమారు రూ.6 లక్షలు తీసుకుంది.

పెళ్లి ఖాయమని భావించిన యువకుడు, ఆమెను పూర్తిగా నమ్మాడు. పెళ్లికి కావాల్సిన షాపింగ్‌ను కూడా ఆమె స్వయంగా చేసింది. దీంతో పెళ్లి ఏర్పాట్లలో యువకుడి కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు.

అయితే పెళ్లి జరగాల్సిన రోజు ఉదయం సదరు మహిళ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఆమె ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, యువకుడు మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఆమె డబ్బులు ఎలా వసూలు చేసింది, ఇందులో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ ముగిసిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.