రాష్ట్రంలోని పోలీస్, అగ్నిమాపక (ఫైర్), జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖల్లోని ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మే 18న జారీ చేసిన జీవో నంబర్ 87 ద్వారా ఐదేళ్ల వయోసడలింపు ఇవ్వగా, తాజాగా దానికి అదనంగా మరో రెండేళ్ల మినహాయింపును ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నిర్ణయంతో అభ్యర్థులకు మొత్తం ఏడేళ్ల అదనపు వయోపరిమితి సడలింపు లభించనుంది. దీనివల్ల కానిస్టేబుల్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లకు, జనరల్ అభ్యర్థులకు 29 ఏళ్లకు చేరుకుంటుంది. అలాగే ఎస్సై పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 37 ఏళ్లు, జనరల్ అభ్యర్థులకు 34 ఏళ్లుగా గరిష్ఠ వయోపరిమితి నిర్ణయమైంది.
యూనిఫాం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన వెలువడగా, దీనివల్ల లక్షలాది మంది అభ్యర్థులకు రానున్న పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశం దక్కనుంది.







