సంగారెడ్డి జిల్లాలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో జగ్గారెడ్డి నంబర్ వన్ నాయకుడని, వెయ్యి కోట్లు ఇచ్చినా ఆయన వంటి నాయకుడు దొరకడని సీఎం అభివర్ణించారు.
జగ్గారెడ్డితో తనకు ముప్పై ఏళ్ల అనుబంధం ఉందని సీఎం గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి జగ్గారెడ్డి అని, రాహుల్ గాంధీ రాముడైతే జగ్గారెడ్డి హనుమంతుడని ఆయన కొనియాడారు. రాహుల్ గాంధీ గీసిన గీతను జగ్గారెడ్డి ఎప్పుడూ దాటరని సీఎం స్పష్టం చేశారు.
జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని సీఎం తెలిపారు. ఒకవేళ జగ్గారెడ్డి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని అంటే, వారం రోజుల పాటు ఆయనను ఇంట్లో ఉంచి తాళం వేయాలని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు.
జగ్గారెడ్డిని కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం కోరారు. ఒక సోదరుడిగా జగ్గారెడ్డికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని, ఆయన ప్రజా జీవితంలో కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.








