టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపగా, సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా క్షీణించి 24,300 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆగస్టు 18న జరగనున్న టాటా సన్స్ ఏజీఎం (వార్షిక సాధారణ సమావేశం)కు ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ వార్తతో టాటా గ్రూప్ షేర్లు 5 శాతం మేర నష్టపోయాయి. ముఖ్యంగా గ్రూపులో అత్యధిక ఆదాయం ఇచ్చే టీసీఎస్ (TCS) షేర్లు రూ. 2,448.70 వద్ద ప్రారంభమై, 5 శాతం పడిపోయి రూ. 2,301.10 వద్దకు చేరాయి. గత సెషన్‌లో ఈ షేరు రూ. 2,440.20 వద్ద ముగిసింది. వీటితో పాటు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లు 4 శాతం, టాటా కన్స్యూమర్ మరియు టాటా పవర్ షేర్లు సుమారు 2 శాతం చొప్పున తగ్గాయి.
1987లో టాటా గ్రూప్‌లో చేరిన చంద్రశేఖరన్, 2009లో టీసీఎస్ సీఈఓగా, 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలోనే ఎయిర్‌లైన్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు మరియు డిజిటల్ వ్యాపారాల్లోకి గ్రూప్ విస్తరించింది. అయితే, కొత్త వ్యాపారాల పనితీరుపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా ప్రశ్నలు లేవనెత్తడం, ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు సుముఖంగా లేకపోవడం వంటి అంశాలు ఈ రాజీనామాకు దారితీసినట్లు సమాచారం.
టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్‌ల ఓటింగ్ సరళిపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఈ రాజీనామా జరిగింది. ఫిబ్రవరి 2027 వరకు ఛైర్మన్‌గా తన పదవీకాలాన్ని చంద్రశేఖరన్ పూర్తి చేస్తారు. 63 ఏళ్ల చంద్రశేఖరన్ ప్రస్తుతం టీసీఎస్, టాటా మోటార్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి పలు కంపెనీలకు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.








