తాటి గారెలు బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా రావాలంటే తయారీలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా ఒక పాత్రలో తాటి గుజ్జు, వరి పిండి, బొంబాయి రవ్వ, బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగే వరకు మిశ్రమాన్ని కలిపి, పది నిమిషాల పాటు పక్కన ఉంచడం వల్ల పిండి పర్ఫెక్ట్‌గా తయారవుతుంది.

బాణలిలో నూనె వేడి చేసి, సిద్ధం చేసుకున్న పిండిని చిన్న ఉండలుగా తీసుకుని గారెల్లా ఒత్తుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి, స్టవ్‌ను మీడియం మంటపై ఉంచి 5 నుంచి 6 నిమిషాల పాటు వేయించాలి. గారెలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత నూనె నుంచి బయటకు తీస్తే, రుచికరమైన తాటి గారెలు సిద్ధమవుతాయి.

తాటిపండులో ఉండే విటమిన్ B, C, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఎముకల బలానికి, రోగనిరోధక శక్తికి తోడ్పడతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే సహజ ఆంటీ-ఆక్సిడెంట్లు కణాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. చక్కెర బదులు బెల్లం వాడటం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.

తాటి గుజ్జు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, వేడిని తగ్గించి డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అయితే, ఈ గారెలను డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి, డయాబెటిస్ లేదా అధిక బరువు ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.