శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ పండుగ రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదాన్ని తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు.

ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో ఒక కప్పు బెల్లం తురుము, రెండు కప్పుల నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉంచాలి. దీనికి పాకం అవసరం లేదు, బెల్లం కరిగిన తర్వాత మలినాలు లేకుండా వడగట్టి పక్కన పెట్టుకోవాలి.

మరో పాన్ లో ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి వేసి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ బాదంపప్పు వేయించుకోవాలి. కావాలనుకుంటే ఎండుద్రాక్షలను కూడా జోడించి, బంగారు రంగులోకి వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

అదే పాన్ లో అర కప్పు ఎండుకొబ్బరి తురుమును దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఎండుకొబ్బరి అందుబాటులో లేకపోతే పచ్చి కొబ్బరి తురుమును కూడా వాడుకోవచ్చు.

తరువాత అదే పాన్ లో మరో స్పూన్ నెయ్యి వేసి ఒకటిన్నర కప్పు లావు అటుకులను వేయించుకోవాలి. సన్నటి అటుకులు వాడితే ప్రసాదం ముద్దగా అయ్యే అవకాశం ఉన్నందున, లావు అటుకులను లో-టు-మీడియం మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి.

అటుకులు వేగిన తర్వాత వడగట్టిన బెల్లం నీళ్లను పోసి మీడియం మంటపై ఉడకనివ్వాలి. అటుకులు నీటిని పీల్చుకుని దగ్గర పడుతున్నప్పుడు, వేయించిన కొబ్బరి తురుమును వేసి లో ఫ్లేమ్ లో కలుపుకోవాలి.

చివరగా అర టీ స్పూన్ యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం పప్పులను కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రసాదం ఆరిన తర్వాత మరింత పొడిపొడిగా మారుతుంది.