గతేడాది సెప్టెంబర్‌లో కరూర్ జిల్లాలో టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 32 మంది బాధితుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద సీఎం విజయ్ జూలై నెలలో ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరావాస చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఈ నియామకాలను సవాలు చేస్తూ మధురైకి చెందిన లాయర్ తీరన్ తిరుమురుగన్‌తో పాటు మరికొందరు మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా లేదని స్పష్టం చేసింది. ఈ నియామకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 నిబంధనలను ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది.

ఇలాంటి నియామకాలు ఇతరులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇలాంటి మార్గాలను ఎంచుకునేలా ప్రేరేపిస్తాయని కోర్టు అభిప్రాయపడింది. దీంతో సీఎం విజయ్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నియామకాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుతో సీఎం విజయ్ ప్రభుత్వానికి న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలింది.

మరోవైపు, కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణ కొనసాగుతోంది. విజయ్ సభకు ఆలస్యంగా రావడం, అనుమతించిన సామర్థ్యం కంటే ఎక్కువ మంది జనం రావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గతంలో ఆరోపించారు. అయితే, పోలీసుల వైఫల్యం మరియు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కుట్ర వల్లే ఈ ప్రమాదం జరిగిందని టీవీకే పార్టీ ఆరోపించింది.