తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా ప్రభుత్వ వైద్యశాలలో రాజేశ్వరి (36) కంప్యూటర్ ఆపరేటర్‌గా అవుట్‌సోర్సింగ్ (ప్రభుత్వేతర సంస్థల ద్వారా తాత్కాలికంగా నియమితులైన వారు) పద్ధతిలో పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆమె విధులను ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, ఒక వ్యక్తి ఆమెపై పెట్రోల్ పోశాడు.
రాజేశ్వరి భయంతో పరుగులు తీస్తుండగా, ఆ వ్యక్తి ఆమెపై నిప్పు వేశాడు. మంటల్లో చిక్కుకున్న ఆమెను ఆసుపత్రి సిబ్బంది వెంటనే రక్షించి, ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను చెన్నైలోని కీళ్‌పాక్కం ఆసుపత్రికి తరలించారు.
ఘటన జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని ప్రకాష్‌గా గుర్తించారు. అతడిని పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మాధవరం సమీపంలోని శ్మశాన వాటిక వద్ద ప్రకాష్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రకాష్ ఎదురుదాడికి దిగి, తమిళ్‌సెల్వవన్ అనే పోలీసు అధికారిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ శివకుమార్ నిందితుడిపై కాల్పులు జరిపి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం నిందితుడు ప్రకాష్‌ను చికిత్స కోసం చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కవిత ఆసుపత్రిని పరిశీలించారు. బాధితురాలు రాజేశ్వరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆమె వెంటిలేటర్ సహాయం లేకుండానే స్పందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.








