శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే OpenAI సంస్థ తన ఏఐ మోడళ్లపై సమీక్ష నిర్వహిస్తుండగా ఈ విషయం బయటపడింది. అమెరికా స్టాక్ మార్కెట్లను నియంత్రించే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) వెబ్‌సైట్లలోని సమాచారాన్ని, అలాగే అమెరికా జనాభా గణనను చూసే సెన్సస్ బ్యూరో డేటాను ఈ ఏఐ మోడళ్లు యాక్సెస్ చేశాయి.
అయితే, ఈ ఘటనలో ఎలాంటి భద్రతా లోపాలు జరగలేదని OpenAI స్పష్టం చేసింది. SEC వెబ్‌సైట్లలోని ఖాతాల్లోకి ప్రవేశించడం, రహస్య ఆధారాలను (క్రెడెన్షియల్స్) వాడటం లేదా సిస్టమ్‌లో ఎలాంటి మార్పులు చేయడం వంటివి జరగలేదని సంస్థ పేర్కొంది. ప్రజలకు అందుబాటులో లేని సమాచారాన్ని ఏఐ మోడళ్లు సేకరించలేదని, వ్యవస్థ దెబ్బతినలేదని తెలిపింది.
ఏఐ వ్యవస్థలు అవాంఛిత రీతిలో ప్రవర్తించే సందర్భాలపై తాము నిరంతరం సమీక్ష చేస్తున్నామని OpenAI ప్రతినిధి లిజ్ బోర్జువా తెలిపారు. తమ వ్యవస్థల వల్ల ఏదైనా సంస్థకు ఇబ్బంది కలిగితే, ఆ విషయాన్ని వెంటనే సంబంధిత సంస్థకు తెలియజేస్తున్నామని ఆమె చెప్పారు. ఏఐ మానవ నియంత్రణను దాటి వెళ్తుందనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలో వేగాన్ని కొంతకాలం తగ్గించాలని పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న పిలుపునకు తాము మద్దతు ఇస్తున్నామని OpenAI గతంలోనే ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏఐ మోడళ్లపై నిరంతరం నిఘా ఉంచే ప్రక్రియను సంస్థ కొనసాగిస్తోంది.








