కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవ సోదరులు తమ రథాల నుంచి కిందికి దిగుతున్నారు. ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడితో తన గాండీవం, అమ్ముల పొదులు తీసుకుని ముందుగా రథం దిగమని చెప్పాడు. కృష్ణుడి మాటపై నమ్మకంతో అర్జునుడు ఏమాత్రం ప్రశ్నించకుండా రథం దిగాడు.
అర్జునుడు దిగిన తర్వాత కృష్ణుడు రథం నుంచి కిందకు వచ్చాడు. వెంటనే రథం పైన ఉన్న ఆంజనేయుడు కృష్ణుడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుక్షణమే రథం గుర్రాలతో సహా చురచురమని శబ్దం చేస్తూ మంటల్లో కాలిపోయింది.
కళ్ల ముందే రథం బూడిదైపోవడాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఈ రథం ఎందుకు ఇలా కాలిపోయిందో చెప్పమని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి వారు ప్రయోగించిన శక్తిమంతమైన బాణాల వల్ల ఈ రథం ఎప్పుడో కాలిపోవాల్సిందని కృష్ణుడు సమాధానమిచ్చాడు.
యుద్ధం జరుగుతున్నంత కాలం తాను రథ సారథిగా ఉండి, రథంపై హనుమంతుడు ఉండటం వల్ల ఆ దైవిక శక్తి రథాన్ని కాపాడిందని కృష్ణుడు వివరించాడు. తన రక్షణ లేకపోతే ఏమై ఉండేవాళ్లమో అని ధర్మరాజు ఈ విషయాన్ని విని ఆవేదన వ్యక్తం చేశాడు. కృష్ణుడు ఏ వైపు ఉంటే ఆ వైపు విజయం ఉంటుందని వ్యాసుడు చెప్పిన మాటను ధర్మరాజు గుర్తు చేసుకున్నాడు.
శ్రీకృష్ణుడి అండదండలు ఉండటం వల్లే పాండవులు యుద్ధంలో విజయాలు సాధించారని ధర్మరాజు భక్తితో నమస్కరించాడు. దైవం ఎప్పుడూ పక్కనే ఉన్నాడనే అచంచలమైన నమ్మకం ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా భయపడాల్సిన అవసరం లేదని ఈ ఘటన చెబుతోంది.








