తమిళనాడు ప్రభుత్వం 'తైమామన్ తంగా మోతిరం తిట్టం' (మేనమామ బంగారం బహుమతి పథకం) పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు ఒక గ్రాము బరువున్న 22 క్యారెట్ల బంగారు ఉంగరాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది.
ఈ పథకాన్ని సెప్టెంబర్ 28న ముఖ్యమంత్రి విజయ్ అధికారికంగా ప్రారంభించబోతున్నారు. అయితే, జూన్ 22న సీఎం విజయ్ జన్మదినం కావడంతో, ఆ రోజు నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు తొలి విడతలో ఈ ఉంగరాలను పంపిణీ చేయనున్నారు.
తొలి విడత పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటికే 1.28 లక్షల బంగారు ఉంగరాలను సిద్ధం చేసింది. వీటిని ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో (ఎవరూ తెరవలేని విధంగా భద్రపరిచిన ప్యాకెట్లలో) అందిస్తారు, అలాగే ప్రతి ఉంగరానికి ఒక ప్రత్యేకమైన సీరియల్ నంబర్ ఉంటుంది.
ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 755.83 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఏడాది కాలంలో సుమారు 4.41 లక్షల బంగారు ఉంగరాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా జొయాలుక్కాస్, కళ్యాణ్ జువెల్లర్స్ సంస్థల నుంచి ఈ ఉంగరాలను కొనుగోలు చేశారు.
ఈ పథకం పొందాలంటే లబ్ధిదారులు తమిళనాడులో శాశ్వత నివాసితులై ఉండాలి. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాబలిపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేదికపై విజయ్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 28 నుంచి అర్హులైన లబ్ధిదారులకు ఈ ఉంగరాలను అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.








