పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం గుర్తింపు లేని 254 మదర్సాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటు మరో 100 మదర్సాలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. ఈ విషయాన్ని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ఖుదీరామ్ టుడు వెల్లడించారు.

నోటీసులు అందుకున్న మదర్సాలు తమకు సరైన అనుమతులు, గుర్తింపు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మదర్సాలు సరైన పత్రాలను సమర్పించడంలో విఫలమైతే, వాటిని కూడా మూసివేస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,132 మదర్సాలు మాత్రమే ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్నాయని ఆయన తెలిపారు. అనుమతులు లేని మదర్సాల సంఖ్య 2,396గా ఉందని ప్రభుత్వం గుర్తించింది.

రాష్ట్ర ప్రభుత్వం కోల్‌కతాతో పాటు 22 జిల్లాల్లో సర్వే నిర్వహించి ఈ మదర్సాలను గుర్తించింది. మూసివేసిన 252 మదర్సాల్లో ఎక్కువ భాగం ఖరేజీ మదర్సాలుగా నివేదికలు చెబుతున్నాయి. మాల్దాలో 44, ఉత్తర దినాజ్‌పూర్‌లో 37, దక్షిణ 24 పరగణాల్లో 32 మదర్సాలపై ఈ చర్యలు తీసుకున్నారు. నదియా, ముర్షిదాబాద్ జిల్లాల్లో చెరో 25 మదర్సాలను అధికారులు గుర్తించారు.

ఈ చర్యలను బీజేపీ సమర్థించింది. సరిహద్దు ప్రాంతాల్లో రాడికలైజేషన్ అంటే మతపరమైన తీవ్రవాద భావజాలం పెరిగిపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య ఆరోపించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు గుర్తింపు లేని మదర్సాల్లో ఆశ్రయం పొందుతున్నారని మంత్రి అగ్నిమిత్ర పాల్ పేర్కొన్నారు.

మరోవైపు, టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మదర్సాలు కూడా విద్యా వ్యవస్థలో భాగమేనని, వాటిని ఉగ్రవాదంతో ముడిపెట్టడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ తనిఖీల ప్రక్రియ ముగిసిన తర్వాత, పత్రాలు సమర్పించని మిగిలిన మదర్సాలపై తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది.