తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం నాలుగు రోజుల పర్యటన కోసం లండన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆయన పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే, విజయ్ పర్యటన తీరుపై బీజేపీ, ఏఐఏడీఎంకే వంటి ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. లండన్‌లో ఉన్న సమయంలో ఆయన సిల్వర్‌స్టోన్‌లో జరిగిన కార్ రేసింగ్‌లో పాల్గొన్నారు. అక్కడ నటుడు అజిత్‌ను కలవడంతో పాటు, రేసింగ్‌ను దగ్గరుండి చూశారు. ఈ కార్యక్రమంలో నటి త్రిష కూడా విజయ్‌తో పాటు ఉన్నారు.

పెట్టుబడుల కోసం వెళ్లిన సీఎం, అసలు ఏ పెట్టుబడులను రాబడుతున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది వ్యక్తిగత పర్యటన అయితే తమకు అభ్యంతరం లేదని, కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విహారయాత్ర చేస్తున్నారని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ విమర్శించారు. ఈ పర్యటన ఉద్దేశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారు కోరారు.

ఈ అంశంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా స్పందించారు. విజయ్ లాంటి అనాగరిక ముఖ్యమంత్రిని తమిళనాడు గతంలో ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ, మలేసియా ప్రధాని చెన్నై వస్తుంటే, సీఎం లండన్‌లో సేద తీరుతున్నారని ఎద్దేవా చేశారు.

విమర్శల నేపథ్యంలో, విజయ్ తన పర్యటనలో భాగంగా పెట్టుబడిదారులను కలిసి చర్చిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు సమర్థించుకుంటున్నాయి. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా లేదా అనేది వేచి చూడాలి.